వేమూరు రైతులకు తక్షణ పంట నష్టపరిహారం, పెండింగ్ ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలి…

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వినతి
-సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రెండు వినతిపత్రాలు అందజేత

బాపట్ల – సూర్యలంక, నేటి పత్రిక ప్రజావార్త:
తుఫాన్లు, భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేమూరు నియోజకవర్గంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని, అర్హులైన రైతులకు పంట నష్టపరిహారంతో పాటు పెండింగ్‌లో ఉన్న రూ.11.79 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయాలని వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బాపట్ల జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ రెండు ప్రత్యేక వినతిపత్రాలను అందజేశారు.

2026 భారీ వర్షాలతో 22,533 మంది రైతులకు పంట నష్టం

2026లో కురిసిన భారీ వర్షాల కారణంగా వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 57 గ్రామాలకు చెందిన 22,533 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే వివరించారు. మొత్తం 15,877 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని, ఇందులో 15,570 హెక్టార్లలో వరి, 307 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.

మండలాల వారీగా పంట నష్టం వివరాలు ఇలా ఉన్నాయి.

చుండూరు: 12 గ్రామాల్లో 2,950 మంది రైతులకు 3,262 హెక్టార్లలో పంట నష్టం.
అమృతలూరు: 13 గ్రామాల్లో 4,099 మంది రైతులకు 3,319 హెక్టార్లలో పంట నష్టం.
వేమూరు: 13 గ్రామాల్లో 6,430 మంది రైతులకు 3,083 హెక్టార్లలో పంట నష్టం.
కొల్లూరు: 9 గ్రామాల్లో 6,400 మంది రైతులకు 3,151 హెక్టార్లలో పంట నష్టం.
భట్టిప్రోలు: 10 గ్రామాల్లో 2,654 మంది రైతులకు 3,062 హెక్టార్లలో పంట నష్టం.

పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి అర్హులైన రైతులందరికీ నిబంధనల ప్రకారం తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఉద్యాన రైతులకు రూ.11.79 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలి

2025–2026 సంవత్సరంలో వరుసగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేమూరు నియోజకవర్గంలో అరటి, మామిడి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

సెప్టెంబర్ 2025లో కృష్ణా నది వరదలు, అక్టోబర్ 2025లో మొంథా తుఫాన్, మే 2026లో భారీ వర్షాలు, వేసవి తుపాన్ల కారణంగా మొత్తం 6,619 మంది రైతులకు చెందిన 3,388.59 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. వీరికి సంబంధించి రూ.11.79 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావాల్సి ఉందని తెలిపారు.

విపత్తుల వారీగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ వివరాలు:

కృష్ణా నది వరదలు: 4,434 మంది రైతులకు చెందిన 2,187 హెక్టార్ల పంట నష్టానికి రూ.7.59 కోట్లు.
మొంథా తుఫాన్: 1,548 మంది రైతులకు చెందిన 852 హెక్టార్ల పంట నష్టానికి రూ.3 కోట్లు.
మే 2026 వేసవి తుపాన్లు: 637 మంది రైతులకు చెందిన 349.59 హెక్టార్ల పంట నష్టానికి రూ.1.20 కోట్లు.

కృష్ణా నది వరదల నష్టానికి సంబంధించి G.O.Rt.No.56, తేదీ 24-06-2026, మొంథా తుఫాన్ నష్టానికి సంబంధించి G.O.Rt.No.70, తేదీ 30-06-2026 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, అర్హులైన రైతులకు సబ్సిడీ అందాల్సి ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తులు

కృష్ణా నది వరదలు, మొంథా తుఫాన్ కారణంగా పెండింగ్‌లో ఉన్న రూ.10.59 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలి.
మే 2026లో వేసవి తుపాన్ల వల్ల నష్టపోయిన రైతులకు సంబంధించిన రూ.1.20 కోట్ల సబ్సిడీని మంజూరు చేసి వారి ఖాతాల్లో జమ చేయాలి.
మొత్తం రూ.11.79 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అర్హులైన 6,619 మంది రైతులకు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయాలి.
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వ్యవసాయ పంటలకు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరికీ తక్షణమే పరిహారం అందించాలి.

రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి

వేమూరు నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతమని, వరుస ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పెట్టుబడులు కోల్పోయి అప్పుల భారంతో సతమతమవుతున్నారని నక్కా ఆనందబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నష్టపోయిన రైతుల సమస్యలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీని సత్వరమే విడుదల చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.