దీపావళి బాణాసంచా దుకాణాలకు జీఎంసీ అనుమతి తప్పనిసరి

-సింగిల్ విండో కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలి: నగర కమిషనర్ కే. మయూర్ అశోక్
-అనధికారికంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
దీపావళి పండుగ సందర్భంగా నగరంలో బాణాసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారస్తులు తప్పనిసరిగా గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ)లో ఏర్పాటు చేసిన సింగిల్ విండో కౌంటర్ ద్వారా అనుమతులు పొందాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలందరూ దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా నగరంలో ప్రమాద రహితంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారస్తులు దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. దరఖాస్తుదారుడి ఫొటోతో కూడిన అప్లికేషన్, అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), ట్రాఫిక్ పోలీసుల అనుమతి, ఫీల్డ్ వెరిఫికేషన్ టీం అనుమతి పత్రం, జీఎస్టీ చెల్లింపు రసీదు, స్థల యజమాని అంగీకార పత్రం, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్, రెవెన్యూ శాఖ అనుమతి పత్రాలను జతచేసి సింగిల్ విండో కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించి, క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం అనుమతులు మంజూరు చేస్తారని వివరించారు. ఇప్పటివరకు బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధించి వ్యాపారస్తుల నుంచి 35 దరఖాస్తులు అందాయని, ఫీల్డ్ వెరిఫికేషన్ టీం తనిఖీలు పూర్తిచేసిన అనంతరం అర్హులకు అనుమతులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల్లో లేదా ముందస్తు అనుమతులు లేకుండా అనధికారికంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

ప్రతి బాణాసంచా దుకాణం వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగినంత నీరు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బాణాసంచా విక్రయ కేంద్రాల వద్ద కొనుగోలుదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లపై ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

వ్యాపారస్తులందరూ సంబంధిత అధికారుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితమైన పద్ధతుల్లో వ్యాపారాలు నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించి దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ కోరారు.