తుపాన్ల వేళ గర్భిణీల సంరక్షణకు విస్తృత ఏర్పాట్లు

-ప్రసవ గడువు సమీపించిన 6,166 మంది గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలింపు
-ఇప్పటికే 2,924 మంది ప్రసవం (47.42%)

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వరుస తుపాన్ల ప్రభావం నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రసవ గడువు సమీపించిన గర్భిణులను గుర్తించి ముందుగానే ఆసుపత్రులకు తరలించడంతో తుపాను సమయంలో రవాణా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తప్పింది. కుటుంబాల్లో ఆందోళన తగ్గడంతో పాటు, సకాలంలో ఆసుపత్రులకు చేరుకునేందుకు సమయం వృథా కాలేదు. మురసు, అర్ణబ్ తుపాన్ల ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 6,166 మంది గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించగా, ఇప్పటికే 2,924 (47.42%).
మంది ప్రసవించారు. వైద్య ఆరోగ్య శాఖ వద్ద నమోదైన వివరాల ఆధారంగా క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది సహాయంతో గర్భిణీలను వారి నివాసిత ప్రాంతాలకు దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.

మురసు తుపాను ప్రభావిత జిల్లాల్లో 3,066 మంది తరలింపు

మురసు తుపాను ప్రభావిత 13 జిల్లాల్లో ప్రసవ గడువు సమీపించిన 3,066 మంది గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇప్పటికే 1,705 మంది ప్రసవించారు (55.61%). తుపాను సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా గర్భిణులను సురక్షితంగా ఆసుపత్రుల్లో ఉంచి వైద్య సేవలు అందించారు. అత్యధికంగా చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలో ప్రసవాలు జరిగాయి.

ఆర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 3,100 మంది తరలింపు

అర్నబ్ తుపాను ప్రభావిత 20 జిల్లాల్లో 3,100 మంది గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 1,219 మంది ప్రసవించారు (39.32%). అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు ప్రసవ గడువు ఉన్న గర్భిణులను గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 124, కాకినాడ-110, మన్యం-108, ఎన్టీఆర్ జిల్లాలో 106 చొప్పున జరిగాయి.

హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి

ప్రసవ గడువు సమీపించిన వారితో పాటు, హైరిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నవారు, కవలల గర్భంతో ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో వీరిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులకు తరలించారు.

రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు

గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో పాటు వైద్యాధికారులు ఏర్పాటు చేసిన ఇతర వాహనాలను వినియోగించారు. అవసరమైన చోట ప్రైవేటు వాహనాల ద్వారా కూడా తరలింపు చేపట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న 550 మంది గర్భిణులను ఆయా ఆసుపత్రులకు తరలించే చర్యలు చేపట్టారు.

మార్రిపూడి పీహెచ్‌సీలో సురక్షిత ప్రసవం

ప్రకాశం జిల్లా మార్రిపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవంబర్ 4న సాయంత్రం 5.58 గంటలకు సాధారణ ప్రసవం జరిగింది. 2.5 కిలోల బరువున్న ఆడ శిశువు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు.

సమన్వయంతో ముందస్తు చర్యలు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణుల గుర్తింపు, ముందస్తు తరలింపు, ఆసుపత్రుల్లో వైద్య సేవల కల్పనలో వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు వెల్లడించారు.