-బాలిక విద్యాభ్యాసం నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచన
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త:
కొండాపురం కేజీబీవీ పాఠశాల పదో తరగతి విద్యార్థిని జి.సుమన్వీ ను తిరిగి పాఠశాలలో చేర్పించి, ఆమె చదువు కొనసాగించేలా సత్వర చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్లతో పాటు జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ, సత్వరమే స్పందించి బాలికను సురక్షితంగా తిరిగి పాఠశాలకు చేర్చినందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి చిన్నారి విద్యా హక్కును పరిరక్షించడం, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
బాలిక విద్యాభ్యాసం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగేందుకు ఆమెను, ఆమె కుటుంబాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ చర్యల్లో చొరవ చూపి, సమన్వయంతో పనిచేసిన అధికారులందరినీ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సంయుక్తంగా స్పందిస్తూ.. బాలిక విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, ఆమె చదువు నిరంతరాయంగా కొనసాగేందుకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సూచనల మేరకు బాలిక విద్యాభ్యాసాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆమెకు, ఆమె కుటుంబానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించి, చదువు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
