-పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన
-జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వరకు కాలినడకన బాధిత రైతులతో మాట్లాడిన సీఎం
-పట్టిసీమ వరమచ్చినా… ప్రకృతి కరుణించలేదని రైతుల ఆవేదన
-చివరి బాధితునికి సైతం సాయం అందే వరకు పని చేస్తామని సీఎం హామీ
-పంటల బీమానే రైతులకు శ్రీరామ రక్ష : ముఖ్యమంత్రి చంద్రబాబు
గుంటూరు/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను, వరద నీటితో మునిగిన పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వరకు నడుచుకుంటూ వెళ్లి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. జిల్లెళ్లమూడి వంతెన వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి రేటూరు గ్రామం వరకు కాలినడకన సాగిన ముఖ్యమంత్రి.. దారిపొడవునా రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. మధ్యమధ్యలో పొలాల వద్ద ఆగుతూ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంట కాలువ గట్లు, పంట బోదెలపై నడుచుకుంటూ వెళ్లి నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. రైతులు పెట్టిన పెట్టుబడులు, పంట దిగుబడి అంచనాలు, నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లెళ్లమూడి వంతెన వద్ద వరద ప్రవాహ ఉద్ధృతిని పరిశీలించిన ముఖ్యమంత్రికి వాగు ఉధృతి కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగిన తీరును రైతులు, అధికారులు వివరించారు. జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వెళ్లే మార్గంలో పలు చోట్ల కోతకు గురైన రహదారిని పరిశీలించారు. నల్లమడ వాగు గేట్లు దెబ్బతిన్నాయని, వాటి కారణంగా నీటి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు చేయించాలని, అవసరమైతే కొత్త గేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లమడ డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరకుండా నియంత్రించడంతోపాటు, వరద వచ్చినప్పుడు వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
రైతులు పడిన కష్టానికి ఫలితం దక్కేలా పని చేస్తున్నాం
రేటూరు గ్రామంలో నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి… వరద నీటిలో మునిగిపోయిన వరి చేలను పరిశీలించారు. పొలం గట్లపై నడుస్తూనే రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా సాగునీరు అందడంతో పంటలు సాగు చేశామని, మంచి దిగుబడి వస్తుందని ఆశించిన సమయంలో తుఫాన్ వచ్చి తీవ్రంగా నష్టపరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం ఎంత పెట్టుబడి పెట్టారు? పంటల బీమా చేయించుకున్నారా? అనే విషయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంటల బీమా, ప్రభుత్వ ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అండగా నిలుస్తాయని వివరించారు. పంటల బీమాపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. తుఫాన్ల ముప్పు తగ్గేలా సాధారణ సాగు సీజన్ కంటే ముందుగానే నీరు అందించి పంటలు వేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ముందస్తు సాగుకు మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రేటూరులో రైతులు, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పట్టిసీమ ద్వారా సాగునీరు అందించడంతో పంటలు సాగు చేశారని, మంచి దిగుబడులు వచ్చే సమయంలో మురసు తుఫాన్ నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్ల నష్టాన్ని చాలావరకు నివారించగలిగామని తెలిపారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందన్నారు. తుఫాన్లపై ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రజలు వాటిని తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముందస్తు చర్యలతో నష్ట నివారణ… వేగంగా పునరుద్దరణ
తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నామని, చివరి బాధితుడికి సాయం అందే వరకు ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు నష్టపోయిన పెట్టుబడిలో కొంత మేర ఉపశమనం కలుగుతుందని చెప్పారు. రైతుల పంట నష్టం అంచనాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని… రైతులకు ఫోన్ల ద్వారా సమాచారం అందుతోందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సంఘాల ప్రతినిధులతోనూ మాట్లాడి కాలువలు, తూముల్లో పేరుకుపోయిన కంప, ఇతర అడ్డంకులను తొలగిస్తున్నారా అని ఆరా తీశారు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్నబ్ తుఫాన్ కారణంగా నేలకొరిగిన 30 వేల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని, మురసు తుఫాన్ వల్ల మరో 10 వేల స్తంభాలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను కూడా త్వరితగతిన పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. తుఫాన్ సహాయక చర్యల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. తుఫాన్ల ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించామని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ఓ పక్క తుఫాన్లు… మరో పక్క ఎల్ నినో
రాష్ట్రంలోని తీర ప్రాంతాలను వరుస తుఫాన్లు ఇబ్బందులకు గురిచేస్తుంటే, రాయలసీమ ప్రాంతం ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాయలసీమలో కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలు కూడా పర్యటించాయని తెలిపారు. ఒకవైపు తీర ప్రాంతాల్లో నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే, మరోవైపు రాయలసీమలో నీటి కొరత నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు నీటి భద్రత, సమర్థ నీటి నిర్వహణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వరద నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసుకుని పంటలను పరిశీలించి, పరామర్శించేవారన్నారు. తాము స్థానిక సంస్థల ఎన్నికల కంటే ప్రజా సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చి తుఫాన్ సమయంలో సహాయక చర్యలను వేగవంతం చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రెండు తుఫాన్లు వచ్చాయని… అయినా ఎన్నికలపై దృష్టి పెట్టకుండా…ప్రజలకు ఇబ్బందులు పరిష్కరించేందుకే ప్రాధాన్యత ఇచ్చామని… నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కొందరు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని, పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అన్ని అంశాలపై మాట్లాడతానని చెప్పారు. అంతకుముందు జిల్లెళ్లమూడి గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రిని అమ్మ భక్తులు కలిశారు. వారు గ్రామంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందించారు. అలాగే అమరావతి నుంచి ఏరియల్ సర్వే చేసుకుంటూ సీఎం చంద్రబాబు సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ పర్యటనలో మంత్రి కొలుసు పార్ధసారధి, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, వేగేశ్న నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు, రెండు జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
