చివరి ఇంటి వరకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి: ముఖ్యమంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుఫాన్ గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ కారణంగా ఆయా జిల్లాల్లో సుమారు 7500 పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు APCPDCL విద్యుత్ సిబ్బంది విస్తృతంగా మరమ్మతు పనులు చేపట్టారు.
ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, APCPDCL సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి గారితో మురసు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ, చేపట్టిన పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని సీఎండీ పి. పుల్లారెడ్డి గారు ముఖ్యమంత్రికి వివరించారు.
విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ సిబ్బంది చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వీలైనంత త్వరగా, చివరి ఇంటి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.