ప్రజారోగ్యం.. పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన

-ముగిసిన బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సుస్థిర అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నవంబర్‌ 1 నుంచి శనివారం వరకు నిర్వహించిన బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు – 2026 రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా జరిగాయి. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ సంచాలకుల కార్యాలయాలు, ప్రభుత్వ వైద్య సంస్థలు, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 35,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించగా, 4.69 లక్షల మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌.ఎస్‌. చక్రధర్‌ బాబు తెలిపారు. శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణతో ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు.

మంగళగిరి ఎకో పార్కులో ముగింపు వేడుకలు

బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాల ముగింపు కార్యక్రమం నవంబర్‌ 7న మంగళగిరిలోని ఎయిమ్స్‌ సమీపంలో ఉన్న మంగళగిరి ఎకో పార్కులో పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ, అటవీ శాఖ, పాఠశాల విద్యాశాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖలు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. పాఠశాల విద్యాశాఖ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలను ప్రదర్శించింది.

ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ తరఫున “ఆరోగ్యకరమైన జీవనశైలి”, “సుస్థిర ఆహార విధానాలు” అనే రెండు ప్రత్యేక అవగాహన శిబిరాలను ఏర్పాటు చేశారు. సమతుల్య ఆహారం, పౌష్టికాహారం, శారీరక వ్యాయామం, వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పర్యావరణహిత ఆహార విధానాలపై సందర్శకులకు వివరించారు. చిన్నారులు, విద్యార్థులు, యువతకు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేశారు. వారోత్సవాల విజయవంతమైన నిర్వహణ మిషన్‌ లైఫ్‌ లక్ష్యాల పట్ల ఆరోగ్య శాఖ నిబద్ధతను చాటిచెప్పిందని రాష్ట్ర నోడల్‌ అధికారి డా. జె. విజయలక్ష్మి తెలిపారు. ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాలను ప్రభుత్వ పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్‌ దండే, ఐఏఎస్‌, రాష్ట్ర అటవీ సంరక్షణాధికారి శ్రీ మహమ్మద్‌ దీవాన్‌ మీదీన్‌ ప్రత్యేకంగా అభినందించారు.