-కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సంతృప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పెదకాకాని, ఫిరంగిపురం మండలాల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌కు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో రికార్డులను 60 రోజులపాటు భద్రపరుస్తున్నామని వెల్లడించారు. అధికారుల పనితీరు, కౌంటింగ్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలు, సుమారు 13 వేల గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, రిటర్నింగ్ అధికారులు హిమశైలజ, మయూరి, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
