-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు – ఎంఎస్ఎంఈలకు ఆర్థిక ఊరట
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద సుమారు రూ.1,400 కోట్ల నిధులను విడుదల చేయడంపై ఏపీ ఛాంబర్స్ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని పేర్కొంది. ఇందులో ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించి రూ.22 కోట్ల నిధులు విడుదల చేయడం విశేషమని తెలిపింది.
ఈ సందర్భంగా ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పారిశ్రామిక రంగానికి ఎంతో సమయోచితమైనదని అన్నారు. ప్రోత్సాహకాల నిధుల విడుదలతో పరిశ్రమలకు ఆర్థిక వెసులుబాటు కలగడంతో పాటు, వర్కింగ్ క్యాపిటల్ లభ్యత మెరుగుపడి ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, ముందుచూపుతో వ్యవహరిస్తూ పరిశ్రమలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ ఛాంబర్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పటిష్టమైన పారిశ్రామిక వ్యవస్థ నిర్మాణానికి కృషి చేస్తోందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూలమైన ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతోందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలను మరింత బలోపేతం చేయడం, నూతన పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం వంటి అంశాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు.
పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని ఏపీ ఛాంబర్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.
