గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 జాతీయ పురస్కారాల్లో గుంటూరు నగరపాలక సంస్థ ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ అవార్డును కైవసం చేసుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ బి. సునీల్ కుమార్ రెడ్డితో కలిసి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆరు అవార్డులను సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా కమిషనర్ కె. మయూర్ అశోక్ మాట్లాడుతూ.. 3 లక్షల నుంచి 10 లక్షలలోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో గుంటూరు నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ విభాగంలో స్వచ్ఛ షహర్ తృతీయ స్థానాన్ని సాధించిందన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ విజయవంతంగా పనిచేస్తోందని, వ్యర్థాల సురక్షిత నిర్వహణకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే, వ్యర్థాల నుంచి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు కొత్త బయో-సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేసినట్లు వెల్లడించారు.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద నూతన ఎలక్ట్రిక్ ఆటోలు, కాంపాక్టర్లు, అత్యాధునిక స్వీపింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి చెత్త సేకరణను వేగవంతం చేశామన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత చెత్తను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి, ఆయా ప్రాంతాలను సుందరీకరించే కార్యక్రమాలను కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, 30 రోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో నగరంలోని చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేసినట్లు వివరించారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకోవడం గుంటూరు నగరానికి గర్వకారణమని కమిషనర్ అన్నారు. ఈ అవార్డు నగర ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల నిరంతర శ్రమ, అధికారుల సమష్టి కృషికి దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. భవిష్యత్తులోనూ గుంటూరును మరింత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.
