-ఏపీ ఛాంబర్స్–యునిడో ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో (ఎంఎస్‌ఎంఈ) ఇంధన వ్యయాలను తగ్గించి, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏపీ ఛాంబర్స్, ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) సంయుక్త ఆధ్వర్యంలో కాన్సంట్రేటెడ్ సోలార్ థర్మల్ (సీఎస్‌టీ) టెక్నాలజీపై అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫుడ్ ప్రాసెసింగ్, మిర్చి ప్రాసెసింగ్, డెయిరీ రంగాలకు చెందిన సుమారు 50 మంది పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా యునిడో సాంకేతిక నిపుణుడు ప్రణబ్ నాథ్ మాట్లాడుతూ.. సీఎస్‌టీ సాంకేతికత పారిశ్రామిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుందని తెలిపారు. సదస్సులో సౌర థర్మల్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, పెట్టుబడి రికవరీ కాలపరిమితి (పేబ్యాక్ పీరియడ్), ప్రభుత్వ సబ్సిడీలపై వివరంగా చర్చించారు. పథక మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రూ.2 కోట్ల వరకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ.. పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడంతో పాటు పోటీతత్వాన్ని పెంచుకోవడానికి పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందిపుచ్చుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.
భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్) భాగస్వామ్యంతో యునిడో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన సదస్సు నిర్వహించారు.
