Breaking News

తనకు ఉన్నదాన్ని ఇతరులకు పంచడంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది – ఉపరాష్ట్రపతి

– జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి.. తర్వాత మాతృభూమి అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపు
– మూలాలను కాపాడుకుంటూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
– పరిపూర్ణ విద్యావికాసానికి ఉన్నతమైన, పవిత్రమైన గురు-శిష్య బంధం ఎంతో కీలకం
– కరోనా సమయంలో విద్యావ్యవస్థను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు శ్రమించిన తీరు అభినందనీయం
– విదేశాల్లో ఉంటున్న తెలుగువారికి మన సంస్కృతి, సంప్రదాయాలను అందించడంలో కృషి చేస్తున్న రామినేని ఫౌండేషన్ కు అభినందనలు
– భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడుతున్న వారందరూ తన సంపదలో కొంత బాగాన్ని సమాజ అభివృద్దికి ఖర్చు చేసినపుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తమ సంపదను మాతృభూమి అభివృద్ధి కోసం వినియోగించడంలో ఏమాత్రం సంకోచించవద్దని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్ లో జరిగిన డాక్టర్ రామినేని ఫౌండషన్ – అమెరికా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘సొంతలాభం కొంత మానుకుని… పొరుగువానికి తోడు పడవోయ్’ అన్న మహాకవి శ్రీ గురజాడ అప్పారావు మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ.. స్వర్గీయ రామినేని అయ్యన్న చౌదరి ఈ మాటలను తు.చ తప్పకుండా ఆచరించారన్నారు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, గణిత శాస్త్రంలో పట్టభద్రుడై అమెరికా వెళ్ళి, అక్కడ ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి, ప్రొఫెసర్ గా పని చేస్తూనే మరింత జ్ఞానాన్ని పెంచుకుని, వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన రామినేని అయ్యన్న చౌదరి జీవితాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు, యువతకు సూచించారు. ఎదిగిన చోటనే ఆగిపోకుండా, మాతృభూమికి ఏదైనా చేయాలనే తలంపుతో అమెరికాలో రామినేని ఫౌండేషన్ స్థాపించి, సేవా మార్గానికి అంకితం కావడం, ఉదాత్తమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడుకోవడం, వృద్ధి చేయడమే ప్రధాన బాధ్యతగా ఈ సంస్థ పనిచేయడం అభినందించదగిన విషయమని ఉపరాష్ట్రపతి అన్నారు. స్వయంకృషితో జీవితంలో ఉన్నతిని సాధించడం ఓ ఎత్తయితే, సమాజ సంక్షేమం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. వివేకానందుని ఆలోచనలు యువత అలవర్చుకోవాలని “మిమ్మల్ని బలవంతునిగా చేసే ప్రతీ ఆలోచన స్వీకరించాలని – మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతీ ఆలోచనను తిరస్కరించాలని ” వివేకానందుని బోధనలు ప్రతిఒక్కరు అలవర్చుకోవాలన్నారు.
దేశ భక్తి అంటే అర్ధం ఎవరి పని వారు చేయడమేనని, ప్రతి మనిషికి సంపద ఒక్కటే కాదని సంతోషంగా ఉండాలన్నారు. భాష, పాట, ఆట, కట్టు, బొట్టు, సాంప్రదాయ పద్ధతులు ప్రతి ఒక్కరూ పాటించాలని, పూర్వీకులు అందించిన ఈ సంస్కృతిని భావి తరాల వారికి అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. భారతీయుడిగా, తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలన్నారు. భారత దేశాన్ని శక్తివంతమైన దేశంగా చూడాలని, ఒకప్పుడు ప్రపంచానికి విశ్వ గురువు బారతదేశమని మరల తిరిగి ఆస్థానాన్ని భారతదేశం పొందాలన్నారు. నలంద, తక్షశిల, పుష్పగిరి, విక్రమశిల, మొదలగు ప్రధాన విద్యాలయాలు భారతదేశంలో ఉండేవని, అనేక దేశాల నుంచి వచ్చి విద్యను అభ్యసించేవారని ఉప రాష్ట్రపతి అన్నారు. దేశ ప్రజల్లో, యువతలో తెలివితేటలకు కొదవ లేదన్నారు. నూతన విద్యా విధానం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ నూతన విద్య విధానం అమలు కావాలని, అన్ని పాఠశాలలోనూ నూతన విద్యావిధానం అమలుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పెను ప్రభావాన్ని చూపించిందన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఎందరో ఉపాధ్యాయులు తమ విద్యార్థుల కోసం నూతన మార్గాలను అన్వేషించి మరీ విద్యను అందించారని ఉపరాష్ట్రపతి అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎందరో మంది గురువులు విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి తగ్గకుండా విద్య పట్ల ప్రోచ్చహాన్ని అందించాలన్నారు. ఈ స్ఫూర్తితో తరగతి గదుల్లో నేరుగా విద్యా బోధనతోపాటు, ఆన్‌లైన్ తరగతి గదులను సమ్మిళితం చేస్తూ, సమగ్రమైన విద్యావిధానాన్ని, దూరవిద్య పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఓవైపు కరోనా మహమ్మారిని ఎదిరిస్తూనే విద్యార్థులకు చదువు చెప్పేందుకు శ్రమించిన ఉపాధ్యాయులందరినీ గౌరవించుకునే ప్రయత్నంలో భాగంగా వారికి అవార్డులు ఇవ్వడం మనందరికీ గర్వకారణమన్నారు. చదువుల్లో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారిని ప్రతిభ అవార్డులతో సత్కరించడం, విద్యార్థులను ముందుకెళ్లేందుకు ప్రోత్సహించడంతోపాటు మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని చాటి చెబుతూ గత 22 ఏళ్లుగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికీ పురస్కారాలు అందిస్తున్న డా. రామినేని ఫౌండేషన్ సేవలను మంత్రి అభినందించారు. కరోనా సమయంలో పేదలకు సామజిక కార్యక్రమాలలో లక్షల డాలర్ లు ఖర్చు చేయడం సంస్థ గొప్పతనానికి నిదర్శనం అన్నారు. సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విద్య, కళల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న రామినేని సంస్థ విశిష్టతను తెలియజేయవచ్చునన్నారు. దేశంలో జాతీయ విద్య విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేసారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వచ్చారని విద్యా రంగానికి భారీగా కేటాయించడం, విద్యాభివృద్ధికి కృషి చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇదే ఆలోచనలతో ఈరోజు రామినేని ఫౌండేషన్ 2020, 2021 సంవత్సరాలకు గాను 356 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, 57 మండలాలకు చెందిన మండల విద్యా శాఖాధికారులకు గురు పురస్కారాలను అందించడం పట్ల మంత్రి సురేష్ రామినేని ఫౌండేషన్ ను అభినందించారు. ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యతతో మెలగాలని సామజిక స్పృహ కలిగి ఉండాలని వివేకానందుని బోధనల ప్రకారం సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
తొలుత ప్రతిబా పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించగా, అనంతరం 2020, 2021 సంవత్సరాలకు గాను 256 జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు (మెరిట్ అవార్డులు) 57 మండల విద్యా శాఖాధికారులకు గురు పురస్కారాలను ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు  మోపిదేవి వెంకటరమణారావు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెన్రీ క్రిష్టినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, పూర్వ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, మాజీమంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, డాక్టర్ రామినేని ఫౌండేషన్ నిర్వాహకులు, ఛైర్మన్  రామినేని ధర్మప్రచారక్, సంస్థ కన్వీనర్ పాతూరి నాగభూషణం సహా ఫౌండేషన్ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *