రాయ‌ల‌సీమ‌కు అంత‌ర్జాతీయ ఖ్యాతి

-కియా రెండో ప్లాంటు ఏర్పాటు ప్రకటనపై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌
-కొత్త ఒప్పందాలతో మరింత అభివృద్ధి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో కియా రెండో ప్లాంట్ ఏర్పాటు కానుండటం రాయలసీమ అభివృద్ధికి గొప్ప వరమని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సుమారు రూ.17 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ మేర‌కు నేడొక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. కియా తొలి ప్లాంట్‌తో ప్రపంచ పారిశ్రామిక పటంలో గుర్తింపు పొందిన ఉమ్మడి అనంతపురం జిల్లా, రెండో ప్లాంట్‌తో దేశంలోనే ప్రముఖ వాహన తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశముందని వివరించారు.

విశాఖపట్నంలో నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు వేదికగా రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.4,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం ఆనందంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కిమ్స్‌ ఆసుపత్రి , మంగళగిరి ఎయిమ్స్‌, పీవీఎస్‌ రామ్మోహన్ హెల్త్ కేర్ ఇండియా , ఇన్ఫినిట్‌ లివరలయన్స్‌ (దక్షిణాసియా కాలేయ వ్యాధుల చికిత్స సంస్థ), ఇత‌ర సంస్థ‌ల పెట్టుబడుల ద్వారా దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్‌మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, పొంగూరు నారాయణ సమక్షంలో ఈ ఒప్పందాలు జరగడం సంతోషకరమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య రంగంలోనూ వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ పెట్టుబడులతో ప్రపంచ స్థాయి వైద్య మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయని, పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజల చెంతకు చేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు