బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు!

-గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ రేపటికి అదే ప్రాంతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. అయితే దీని తదుపరి పయనంపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు.

దీని ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.