-ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో అవగాహన కార్యక్రమం – వైద్య, కంటి పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే బాలల హక్కుల వారోత్సవాలను స్థానిక కబేలాలోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్, అమృత హస్తం ఫౌండేషన్, మ్యాక్స్ విజన్, బర్డ్స్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బాలల హక్కులు, బాధ్యతలు, విద్య, క్రమశిక్షణ, ఆరోగ్యం, సత్ప్రవర్తనపై బాలలకు అవగాహన కల్పించారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని మంచి మార్గంలో పయనిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అనంతరం బాలురకు ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ కె. వీరయ్య, రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చాంద్ భాషా, అమృత హస్తం డైరెక్టర్ ధారా కరుణశ్రీ, మ్యాక్స్ విజన్ ప్రతినిధి కలపల భీమా, బర్డ్స్ సంస్థ కార్యదర్శి కోటే ప్రకాష్ కుమార్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్, డీసీపీవో రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
