‘జై భీమ్ మైండ్స్–2026’ స్కాలర్‌షిప్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతిభావంతులైన విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు కృషి చేస్తున్న అభ్యర్థులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘జై భీమ్ (బెస్ట్ హోప్ ఫర్ ఇన్‌స్పైర్డ్) మైండ్స్–2026 స్కాలర్‌షిప్ టెస్ట్’ పోస్టర్‌ను విశ్రాంత కలెక్టర్ ఎ.ఎం.డి. ఇంతియాజ్ ఐఏఎస్ ఆవిష్కరించారు. శనివారం మాచవరం, మారుతీనగర్‌లోని ‘కిక్ ఫర్ యూపీఎస్సీ’ (కండెల్లి ఇన్‌స్టిట్యూట్ నాలెడ్జ్ ఫర్ యూపీఎస్సీ) కోచింగ్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఇంతియాజ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం అందించడం అభినందనీయమన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరి ప్రతిభా మరుగున పడకూడదని, అభ్యర్థుల ప్రభుత్వ ఉద్యోగ కలలను సాకారం చేసేందుకు కిక్ ఫర్ యూపీఎస్సీ నిర్వాహకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మన్నం రాజారావు మాట్లాడుతూ, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేని యువతకు ఈ స్కాలర్‌షిప్ పరీక్ష సువర్ణావకాశమని అన్నారు. కష్టపడి చదివే విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే మంచి ఉద్దేశంతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
కిక్ ఫర్ యూపీఎస్సీ సంస్థ డైరెక్టర్ కండెల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ, నవంబర్ 22న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఇందుకోసం సంస్థను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. 9491549839 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా లేదా kikforupsc@gmail.comకు ఈ-మెయిల్ పంపడం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్-2 పరీక్షలతో పాటు సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ శిక్షణ, టెస్ట్ సిరీస్ సౌకర్యాలు అందించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ర మాల్యాద్రి, సంస్థ అధ్యాపక బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.