విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పద్మభూషణ్, నటశేఖర సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, జైకృష్ణ, గౌతమ్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లోని సూపర్ స్టార్ కృష్ణ పార్కు వద్ద ఈ కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా పేదలకు పండ్లు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడంతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరం, అన్నసమారాధన నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 60వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ హాజరయ్యారు. వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి, పేదలకు పండ్లు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నటశేఖరుడిగా, సూపర్ స్టార్‌గా కృష్ణ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. సుధాస్వామిని అభినందించారు.
అనంతరం కార్యక్రమ నిర్వాహకులు, అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. సుధాస్వామి మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అని పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో ఎన్నో నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టి, తనదైన నటన, విభిన్న కథాంశాలు, సాహసోపేతమైన చిత్రాలతో సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారని అన్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవ, రాజకీయ రంగాల్లోనూ కృష్ణ తనదైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ బోస్, మణిపాల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి కె. సుధాస్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
