చిన్నకంచి, నేటి పత్రిక ప్రజావార్త:
బ్రాహ్మణ సమాజ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న పరిధిలోని చిన్నకంచిలో ఎలైట్ బ్రాహ్మిన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్చకులు, వేద పండితుల సంక్షేమం, దేవాలయ ట్రస్టీ బోర్డుల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం, దేవాలయాల నిర్మాణానికి టీటీడీ ద్వారా రూ.40 లక్షల వరకు ఆర్థిక సహాయం వంటి అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
బ్రాహ్మణ యువత ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించాలని, బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అర్హులైన యువతకు రూ.40 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించే అవకాశాలపై కూడా వివరించారు.
ఉన్నత విద్య కోసం వచ్చే బ్రాహ్మణ విద్యార్థినులకు విజయవాడలో ప్రత్యేక మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇప్పటివరకు రూ.7 కోట్ల డివిడెండ్ చెల్లించామని, మరో రూ.8 కోట్ల చెల్లింపులపై ఆడిట్ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బ్రాహ్మణుల ఐక్యత, విద్య, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యం, అర్చకుల సంక్షేమం, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాదులని బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఎలైట్ బ్రాహ్మిన్స్ నిర్వాహకులను అభినందించారు.
బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత: బుచ్చి రామ్ ప్రసాద్
