-గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలికి 620 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురానికి 680 కిలోమీటర్లు, చెన్నైకి 800 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ రేపు దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా, ఎల్లుండికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం మరింత బలపడి వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని వివరించారు.
తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కోస్తాంధ్ర తీరం వెంబడి మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఆ తర్వాత వాటి తీవ్రత క్రమంగా పెరుగుతుందని తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు, రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
