-ఆన్లైన్ పోర్టల్ ద్వారా రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ తీరుపై సమీక్ష
-నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
-అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలి
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ సోమవారం జిల్లా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిశితంగా పర్యవేక్షించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలు, తిరువూరు డివిజన్ పరిధిలోని ఒక మండలం (రెడ్డిగూడెం)లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగుతున్న రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆన్లైన్ పోర్టల్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు. ఆయా నామినేషన్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియ, అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి ప్రతి రోజు స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి.సీతామహాలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారులు, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
