ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ

-మొదటి దశ ఎన్నికలకు రెండో రోజు ముగిసిన నామినేషన్ల స్వీకరణ
-రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 243, వార్డు సభ్యుల స్థానాలకు 1,443 నామినేషన్లు దాఖలు
– మొదటి రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 295, వార్డు సభ్యుల స్థానాలకు 1,583 నామినేషన్లు
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశకు సంబంధించి రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ వెల్లడించారు. మొదటి దశలో భాగంగా విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలు, తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక మండలం కలిపి మొత్తం ఐదు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోందని తెలిపారు.

రెండో రోజు సర్పంచ్ స్థానాలకు మొత్తం 243 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,443 నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్ వివరించారు.

మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 52 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 140 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు నమోదైన నామినేషన్లతో కలిపి ఇప్పటివరకు సర్పంచ్ స్థానాలకు మొత్తం 295, వార్డు సభ్యుల స్థానాలకు 1,583 నామినేషన్లు అందినట్లు తెలిపారు.

సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా జి.కొండూరు మండలంలో 107 నామినేషన్లు, విజయవాడ రూరల్ మండలంలో 69 నామినేషన్లు దాఖలయ్యాయి.

వార్డు సభ్యుల స్థానాలకు అత్యధికంగా విజయవాడ రూరల్ మండలంలో 513 నామినేషన్లు, జి.కొండూరు మండలంలో 399 నామినేషన్లు నమోదయ్యాయి.

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు.