జనగణన ఫేజ్-2పై ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో జనగణన ఫేజ్-2కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిటీ సెన్సస్ ఆఫీసర్ మరియు అదనపు కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. జనగణనకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలు, సమాచార సేకరణ పద్ధతులపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా అమలు చేస్తూ, జనగణన ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించేలా చూడాలని తెలిపారు. ప్రజల నుంచి సేకరించే వివరాలను జాగ్రత్తగా నమోదు చేయడంతో పాటు, నిర్దేశించిన నిబంధనలు, గడువులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ట్రైనర్ సీహెచ్. వెంకటరమణ, మాస్టర్ ట్రైనర్లు డాక్టర్ పద్మనాభం, డాక్టర్ రమేష్, డాక్టర్ నవీన, పాఠశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.