-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. అదే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోనల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కూడా ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫిర్యాదుదారులను కార్యాలయాలకు పదేపదే పిలిపించకుండా, సమస్య తలెత్తిన ప్రాంతానికి అధికారులు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. సమస్యకు గల కారణాలను పూర్తిగా తెలుసుకుని, నిబంధనలకు అనుగుణంగా శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
పరిష్కరించేందుకు అవకాశం లేని ఫిర్యాదుల విషయంలో, ఏ నిబంధన లేదా ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) ప్రకారం సమస్యను పరిష్కరించలేకపోతున్నారో ఫిర్యాదుదారులకు స్పష్టంగా, అర్థమయ్యే విధంగా తెలియజేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు సమాధానం చెప్పే విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 23 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై సంబంధిత అధికారులకు కమిషనర్ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన 6 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 6, ఎస్టేట్ విభాగానికి 1, రెవెన్యూ శాఖకు 5, యూసీడీ విభాగానికి 3, పబ్లిక్ హెల్త్ శాఖకు సంబంధించి 2 ఫిర్యాదులు అందినట్లు అధికారులు కమిషనర్‌కు వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ. రవీంద్రరావు, డాక్టర్ డి. చంద్రశేఖర్, కె. శకుంతల, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, కె. దుష్యంత్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, అకౌంట్స్ ఎగ్జామినర్ చక్రవర్తి , రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
