సంక్షేమ వసతి గృహాల్లో 2.65 లక్షల మంది చిన్నారుల‌కు వైద్య పరీక్షలు

-జ్వరాలు, రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది
-తుపానుల అనంతరం సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెండు వారాల పాటు కొనసాగిన ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు
-వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు నివేదిక అందజేసిన అధికారులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తుపానుల అనంతరం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య బృందాలు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 1 నుంచి 13వ తేదీ మధ్య 2,148 వసతి గృహాల్లోని 2,65,556 మంది విద్యార్థులకు జ్వరాలు, రక్తహీనత, చర్మ, శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు జ‌రిగాయి. విద్యార్థులకు ఆయా వసతి గృహాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది ద్వారా ప్ర‌త్యేక ప‌రీక్ష‌లు జ‌రిగాయి. వైద్య బృందాలు అవ‌స‌ర‌మైన వారికి అక్క‌డిక‌క్క‌డే చికిత్స అందించాయి. అవ‌స‌ర‌మైన వారికి ఇంకా వైద్య చికిత్స‌ల‌ను కొన‌సాగిస్తున్నాయి. సాధారణంగా స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు జరుగుతుంటాయి. వరుస తుపానుల నేపథ్యంలో సీఎం చంద్ర‌బాబు, వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశాల మేర‌కు ఈసారి ప్రత్యేకంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.

చర్మవ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యల గుర్తింపు

వైద్య పరీక్షల్లో 4,436 మంది పిల్లలకు చర్మవ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. పరీక్షలు చేయించుకున్న‌ పిల్లల్లో ఇది 1.67 శాతం. 961 మందికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు (0.36 శాతం), 2,750 మందికి దంత సమస్యలు (1.03 శాతం), 85 మందికి అతిసార వ్యాధులు (0.03 శాతం) ఉన్నట్లు వెల్లడైంది. మలేరియా కేసులు 14 (0.01 శాతం), టైఫాయిడ్‌ కేసులు 8 (0.01 శాతం) నమోదయ్యాయి. ఒక్క డెంగీ కేసు కూడా న‌మోదే కాలేదు. 3,218 మంది పిల్లల్లో రక్తహీనత (1.21 శాతం) ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మరో 1,842 మందికి (0.69 శాతం) ఇతర వ్యాధులు ఉన్నట్లు నివేదికలో గుర్తించారు.

జిల్లాల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలవారీ వివరాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆరోగ్య సమస్యలు వెలుగు చూశాయి. కాకినాడ జిల్లాలో 15,165 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, చర్మవ్యాధులు, దంత సమస్యలు, రక్తహీనత అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు. ఏలూరు జిల్లాలో 14,918 మందికి పరీక్షలు నిర్వహించగా, శ్వాసకోశ, చర్మవ్యాధులు, ఇతర సమస్యలు వెలుగు చూశాయి.

అనకాపల్లి జిల్లాలో 11,030 మందికి పరీక్షలు నిర్వహించగా, చర్మవ్యాధులు ప్రధానంగా నమోదయ్యాయి. పోలవరం జిల్లాలో 27,281 మందికి పరీక్షలు నిర్వహించి చర్మ, దంత సమస్యలతోపాటు మలేరియా, టైఫాయిడ్‌ కేసులను గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10,691 మందికి పరీక్షలు నిర్వహించగా, చర్మ, దంత సమస్యలు, మలేరియా, అతిసార కేసులు నమోదయ్యాయి. అవసరమైన విద్యార్థులకు సంబంధిత పీహెచ్‌సీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పరిశుభ్రత.. భద్రతా ప్రమాణాల పరిశీలన

వసతి గృహాల్లో అంటువ్యాధుల ముందస్తు గుర్తింపుతోపాటు తాగునీటి నాణ్య‌త‌, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార భద్రత, పరిసరాల పరిస్థితులను వైద్య బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,706 వసతి గృహాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు బాగుండగా, మరో 442 వసతి గృహాల్లో ఇంకా మెరుగుప‌డాల్సిన అవ‌స‌ర‌ముంది. మరుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి 1,238 వసతి గృహాల్లో మంచి పరిస్థితులు ఉండగా, 896 వసతి గృహాల్లో మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. మరో 14 చోట్ల మరుగుదొడ్లు అందుబాటులో లేవని లేదా మరమ్మతులు అవసరమని నివేదికలో పొందుప‌రిచారు.

సూచనలు

వసతి గృహాల్లో సురక్షిత తాగునీటి సరఫరాను నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు జ‌ర‌ప‌డం, తగినంత క్లోరినేషన్‌ చేపట్టడం, సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని నివేదిక‌లో సూచించారు. “మరుగుదొడ్లు, చేతులు కడుక్కునే సదుపాయాలను సక్రమంగా నిర్వహించడంతోపాటు పారిశుద్ధ్య ప్రమాణాలను పటిష్ఠంగా అమలు చేయాలి. వంటశాలల పరిశుభ్రత, ఆహార నిల్వ, వంట తయారీ విధానాల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. దోమల వృద్ధి కేంద్రాలను పూర్తిస్థాయిలో తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. దోమల నియంత్రణ చర్యలను మరింత వేగ‌వంతం చేయాలి. వసతి గృహాల్లో వ్యాధులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. అనుమానిత వ్యాధి కేసులు ఎక్కువ సంఖ్య‌లో నమోదైనా, కేసుల సంఖ్య అసాధారణంగా పెరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి” అని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు సమర్పించిన నివేదికలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ ఆర్‌.వెంకటరమణ పేర్కొన్నారు.