Breaking News

టాటాట్రస్ట్‌ వాసవ్య మహిళామండలి సంయుక్తంగా కిడ్నీ వ్యాధిపై అద్యయనం…

-ఏ కొండూరు సమీప తండాల ప్రజలతో కలిసి జీవించనున్న బృందం…
-పూర్తి స్థాయిలో విశ్లేషించి వ్యాధిని నివారించేందుకు ప్రణాళిక…
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టాటాట్రస్ట్‌ వాసవ్య మహిళామండలి సంయుక్తంగా జిల్లాలోని ఏ కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు మండలాలకు చెందిన గ్రామాల్లో కిడ్నీ వ్యాధికిగల కారణాలపై అద్యయనం చేసి వ్యాది నివారణ చర్యల నివేదికను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
ఏ కొండూరు సమీపంలో కిడ్నీ వ్యాది ప్రభలడానికి గల కారణాలపై అద్యయనం చేసేందుకు ముందుకు వచ్చిన టాటాట్రస్ట్‌, వాసవ్య మహిళామండలి, వైద్య అధికారులు, త్రాగునీటి సరఫరా అధికారులతో బుధవారం కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని తన కార్యాలయం నుండి జూమ్‌ కాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం పరిధిలోని ఏ కొండూరు ,రెడ్డిగూడెం, గంపలగూడెం, విస్సన్నపేట మండలాలకు చెందిన కొన్ని గ్రామాలలోని ప్రజలు కిడ్నీవ్యాధికి గురై బాధపడుతున్నారన్నారు. ఇటీవల వ్యాధి లక్షణాలు ఉన్న 871 మంది నుండి సీరం రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా 104 మందికి 2 శాతం కన్న ఎక్కువ క్రియాటిన్‌ ఉన్నట్లు నిర్థారణ అయిందన్నారు. 15 మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారని మిగిలిన వారు నివారణ మందులు వాడుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారన్నారు. ప్రస్తుతం కిడ్నీవ్యాధిగ్రస్థుల నివాసిత ప్రాంతాలలోని భూ గర్భజలాలలో ఫోరైడ్‌తో కూడిన సిలికాన్‌ శాతం ఎక్కువగా వుండడంతో పాటు కాల్షియం, మెగ్నిషియం, యురేనియం శాతం కూడా అధికంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నటు గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధికి గురి కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవలసి ఉందని ఇందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలని కలెక్టర్‌ కోరారు. వ్యాది ప్రబలటానికి గల కారణాలను అద్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. టాటాట్రస్ట్‌ వాసవ్య మహిళామండలికి చెందిన సభ్యులు ఆయా ప్రాంతాల నందు క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు అక్కడి ప్రజలతో కలసి కొద్దిరోజుల పాటు జీవించి ప్రజల జీవన శైలిని పూర్తిగా అద్యయనం చేయాలన్నారు. ప్రజల దినచర్య, ఆహారపు ఆలవాట్లు, త్రాగుతున్న త్రాగునీరు వంటి విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. వారం రోజులలో టాటాట్రస్ట్‌ మహిళామండలి సభ్యులు తండాల పర్యటనకు సంబంధించిన ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. ఆయా బృందాలకు చెందిన సభ్యులకు జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారం అందజేయడం జరుగుతుందన్నారు. అవసరమైతే సర్వేకి సంబంధించి ఆర్థిక సహాయం కూడా అందించేందుకు సహకరిస్తామని కలెక్టర్‌ తెలిపారు. తండాలలోని ప్రజలకు దురలవాట్లు, వ్యసనాలు, మత్తుపదార్థాలు, మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ అన్నారు.
గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఇ ఎన్‌.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎ కొండూరు, విస్సన్నపేట తదితర ప్రాంతాలలోని ప్రజలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కృష్ణానదీ జలాలు ప్రస్తుతం మైలవరం నియోజకవర్గం వరకు సరఫరా అవుతున్నాయని, మైలవరం నుండి ఎ కొండూరు వరకు పైపు లైన్‌ పొడిగించి కృష్ణానదీ జలాలను సరఫరా చేసేందుకు 37 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగిందని వివరించారు.
కాన్ఫరెన్స్‌లో టాటాట్రస్ట్‌ జిల్లా మేనేజర్‌ మనోజ్‌ కుమార్‌, వాస్యవ మహిళామండలి కార్యదర్శి డా. రేష్మి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ ఎన్‌.వి.వి. సత్యనారాయణ, ఎగ్జిక్యూట్‌ ఇంజనీరింగ్‌ డిఎల్‌ఎన్‌ ప్రసాద్‌, తిరువూరు డిప్యూటి ఎగ్జిక్యూట్‌ ఇంజనీరింగ్‌ అప్పారావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.యం సుహాసిని, అడిషనల్‌ డియంహెచ్‌వో డా. జి. ఉషారాణి, ఎ కొండూరు పిహెచ్‌సి వైద్యురాలు డా.గిరిజ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *