-ప్రభుత్వం నుండి లక్ష 80 వేలు డ్వాక్రా లేదా బ్యాంకు ద్వారా 35 వేల రుణం..
-మొదటి పేజ్ లేఅవుట్‌లో 70 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తాం..
-గుత్తేదారులు పనులను వేగవంతం చేసి నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుత్తేదారులు పనులను వేగవంతం చేసి గృహా నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు లబ్దిదారులకు రూ. 2.15 లక్షలకే జగనన్న గృహాన్ని నిర్మించడం జరుగుతుందని జిల్ల్లాకలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు.
విజయవాడ సెట్రల్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన లబ్దిదారులకు కేటాయించిన జగనన్న లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన, గృహ నిర్మాణాల ప్రగతిపై శుక్రవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, వెలంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో గృహాలను నిర్మించేందుకు అదనపు నగదును చెల్లించాలని వస్తున్న దుష్ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రూ.2.15 లక్షలకే లబ్దిదారులకు అన్ని వసతులతో కూడిన గృహాన్ని నిర్మించి ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయం పై మున్సిపల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో చర్చించి అంగీకారం తీసుకోవడం జరిగిందన్నారు. మొదటి పేజ్‌లో చేపట్టిన వణుకూరు లేఅవుట్‌లో 7,859 గృహాలకు గాను 1,316 గృహాలు, ఉప్పులూరు లేఅవుట్‌లో 1,428 గృహాలకు గాను 980, వెదురుపావులూరు లేఅవుట్‌లో 6,280 గృహాలుకు గాను 130 గృహాలు, కొండపావులూరు లేఅవుట్‌లో 7,000 గృహాలకు గాను 450 గృహాలు, సూరంపల్లి లే అవుట్‌లో 4,060 గృహాలకు గాను 2,649 గృహాలు, నున్న లేఅవుట్‌లో 4,149 గృహాలకు గాను 3,500 గృహాలు, వెలగలేరు లేఅవుట్‌లో 9,504 గృహాలకు గాను 2,140 గృహాలను గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు. కొండపల్లి లేఅవుట్‌కు సంబంధించి 2,060 గృహాలు మంజూరు చేయడం జరిగిందని త్వరలో లబ్దిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండవ పేజ్‌కు సంబంధించి గొడవర్రు, సున్నంపాడు, మునగపాడు, వేల్పూరు, ముత్యాలపాడు, కౌవులూరు లలో లేఅవుట్‌లలో మౌలిక వసతులు కల్పించేందుకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపనున్నామన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జగనన్న కాలనీలలో వ్యక్తిగతంగా నిర్మాణం జరుపుకుంటున్న లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గృహాలు మంజూరైన లబ్దిదారులకు ఏ దశలో ఏ లేఅవుట్‌లో మంజూరు చేసింది స్పష్టంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.2.15 లక్షలకే లబ్దిదారులకు ప్రభుత్వం గృహాన్ని నిర్మించి ఇస్తుందనే విషయాన్ని ప్రచార మాధ్యమాలు, కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ముఖ్యంగా గృహా నిర్మాణాలను చేపట్టిన కాలనీలలో త్రాగునీరు, విద్యుత్ వంటి తాత్కాలిక వసతులను కల్పించకపోతే లబ్దిదారులు, కాంట్రాక్టర్లు సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ప్రతీ లేఅవుట్‌లో గృహా నిర్మాణాలకు సంబంధించి అన్ని శాఖలకు చెందిన అధికారులందరు హాజరయ్యేలా లేఅవుట్‌లోనే లబ్దిదారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగనన్న లేఅవుట్‌లో ప్రతీ కాలనీ నందు లబ్దిదారులతో రూ.2.15 లక్షలతో ఒక మోడల్ గృహాన్ని నిర్మించి, మిగిలిన లబ్దిదారులకు అవగాహన కల్పించి చేతన్యవంతులుగా చేయడం ద్వారా గృహా నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం వుంటుందన్నారు. గతంలో సిఆర్‌డిఏ భూములలో గృహాలను కేటాయించబడి కోర్టు తీర్పుల దృష్ట్యా లబ్దిదారులకు వేరే చోట గృహాలను కేటాయించవలసి ఉందని, ఇందుకు సంబంధించి భూముల సేకరణ విషయంలో ప్రజా ప్రతినిధుల సలహాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధుల సూచనలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మొదటి దశలో మౌలిక వసతుల పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగతంగా గృహాలు నిర్మించుకునే లబ్దిదారులకు బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించే లక్ష 80 వేల రూపాలయుల కు అందనంగా 35 వేల రూపాయలు డ్వాక్రా రుణాలు అందించడం జరుగుతుందని, డ్వాక్రా సభ్యులు కాని లబ్దిదారులకు సంబందించి త్వరలో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి లబ్దిదారుల పట్టాలపై 35 వేల రూపాయలు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. సిఆర్‌డిఏ పరిధిలో కేటాయించిన 24,500 మంది లబ్దిదారులకు సంబంధించి జగనన్న లేఅవుట్లకు అవసరమైన భూముల సేకరణలో స్థానిక శాసనసభ్యులు, నగర మేయర్, తదితర ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని లబ్దిదారులకు అనువైన రీతిలో భూములను సేకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపుర్ అజయ్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, అదనపు కమీషనర్ శ్యామల, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీదేవి, కార్పొరేషన్ హౌసింగ్ డిఇ రవికాంత్ ఉన్నారు.