Breaking News

పూజలు, హోమాలతో చతుర్థి వార్షిక బ్రహ్మోత్సవాలు…


-విశేష పూజలు అందుకుంటున్న శ్రీనివాసుడు
-వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు…
-అశేషంగా పాల్గొంటున్న భక్తులు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడుకొండలవాడా.. వెంకటరమణా… గోవిందా… గోవిందా.. అంటూ ఆ దేవదేవుడి నామస్మరణతో తాడిగడప గ్రామం మారుమోగుతోంది. పూజలు, హోమాలు, కల్యాణలతో నిత్యం విశేష పూజలు అందుకుంటున్న శ్రీనివాసుడికి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు అశేషంగా పాల్గొంటున్నారు. నగర పరిధిలోని పెనమలూరు మండలం, తాడిగడప గ్రామం లోని లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్ లో ఉన్న శ్రీనివాస క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది చతుర్ధ వార్షిక బ్రహ్మోత్సవాలు గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 8వ తేదీ బుధవారం వరకు కొనసాగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు అగ్నిహోత్రం ప్రవీణ్ నేతృత్వంలోని పూజారులు వేద పండితులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. స్వామి వారికి నిత్యం నిర్వహించే పూజలతో పాటు సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురారోహణ, ధ్వజారోహణ, నిత్య హోమం, బలిహరణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి 8 గంటలకు నీరాజనం మంత్రపుష్పం వంటి పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు సోమవారం తెల్లవారు జామున సుప్రభాత సేవ, తోమలసేవ, పుణ్యాహవాచనం, అర్చన, విశేషపరమాత్మ శాంతి హోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి గరుడ సేవను నిర్వహించారు. తిరుమలలో స్వామివారికి నిర్వహించే గరుడ వాహన సేవ మాదిరిగా గరుడవాహనంపై స్వామివారిని గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం అన్న సమారాధన తో పాటు పలు విశేష పూజలు, విశేష వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాలంకరణ మధ్య స్వామివారి ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు, పాల్గొనేందుకు భక్తులు పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సోమవారం నిర్వహించిన హోమం కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను ఆలయ అభివృద్ధి కమిటీ దగ్గరుండి ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తాడిగడప గ్రామం భక్తి పారవశ్యంలో మునిగి పోయింది.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *