– వ్యయ పరిశీలనలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి
– జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయ పర్యవేక్షణను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయకుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు నియమించిన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో సర్వైలెన్స్ బృందాలు, జిల్లా నోడల్ అధికారులు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులతో బుధవారం వర్చువల్ విధానంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఎన్నికల వ్యయ పర్యవేక్షణ ఏర్పాట్లను సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి అధికారి కచ్చితంగా పాటించాలని, ఎన్నికల వ్యయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు. పోటీచేసే అభ్యర్థులు నిర్వహించే రోజువారీ ఎన్నికల వ్యయ ఖాతాలను నిర్దేశిత ప్రొఫార్మాలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ రిజిస్టర్ల నంబరింగ్, ధృవీకరణ ప్రక్రియను సక్రమంగా పూర్తిచేయాలన్నారు. అభ్యర్థుల అసలు వ్యయ రిజిస్టర్లతో అధికారులు నిర్వహించే షాడో రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సరిపోల్చి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను వీడియోగ్రాఫర్లతో సహా 24 గంటలూ అందుబాటులో ఉండేలా మోహరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, వాహనాలు, లౌడ్ స్పీకర్ల వినియోగంపై వీడియో సర్వైలెన్స్ బృందాలు నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి జారీ చేసిన అనుమతులు, వాస్తవంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అకౌంటింగ్ బృందాలు నమోదు చేస్తున్న వ్యయాలతో సరిపోల్చి పరిశీలించాలన్నారు. ప్రతి ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ఆధారాలను భద్రపరచాలని విజయకుమార్ తెలిపారు.
