-రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు నవంబర్ 19న పరోక్ష ఎన్నికలు
-ఉదయం 10 గంటల నుంచి కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ
-మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు
-ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎన్టీఆర్ జిల్లాలోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు కో-ఆప్టెడ్ సభ్యుల పరోక్ష ఎన్నికలను రేపు 19వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని మండలాలకు అధ్యక్షత వహించే అధికారులను నియమించామని, వారికి సమావేశాల నిర్వహణ, అవసరమైన సభ్యుల హాజరు, నామినేషన్ల స్వీకరణ, ఓటింగ్ విధానం, రాజకీయ పార్టీల విప్ నిబంధనలు, ఫలితాల నమోదు తదితర అంశాలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కో-ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు సంబంధించి ఉదయం 10 గంటలలోపు నిర్ణీత నమూనాలో, మైనారిటీ ధ్రువీకరణ పత్రంతో కూడిన నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఒక్కరే పోటీలో ఉన్నట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలోపు మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులందరూ సమావేశ ప్రదేశానికి హాజరుకావాలి. వారి హాజరు నమోదు చేసిన అనంతరం తెలుగు అక్షర క్రమంలో పేర్లు పిలిచి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నట్లయితే, అవసరమైన సభ్యుల హాజరు పూర్తయిన అనంతరం అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమంలో పిలిచి, సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నిక నిర్వహిస్తారు. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని సహనియమిత సభ్యునిగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏ కారణం చేతనైనా కో-ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరగని పక్షంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక విధానం
మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సంబంధిత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశానికి హాజరవుతారు. ప్రత్యేక ఆహ్వానితులకు ముందు వరుసలో, నూతనంగా ఎన్నికైన ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు వారి రాజకీయ పార్టీల వారీగా కూర్చునే ఏర్పాట్లు చేస్తారు. అవసరమైన సభ్యుల హాజరు నిర్ధారించిన అనంతరం ఎన్నికైన ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల నుంచే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ జారీ చేసిన విప్‌కు అనుగుణంగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ముందుగా అధ్యక్ష పదవికి చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక నిర్వహించి ఫలితాన్ని ప్రకటిస్తారు. అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాత మాత్రమే ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించి, ఎన్నికల వివరాలను సమావేశపు నిమిషాల పుస్తకంలో నమోదు చేస్తారు.
పటిష్ట భద్రత, పారదర్శక ఏర్పాట్లు
ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశ మందిరాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, పాత్రికేయులకు వార్తా సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు.
