కంచికచర్ల మండల అభివృద్ధికి నూతన ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలి

-పదవులు హోదా కోసం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించాలి – విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త:
కంచికచర్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికతో పాటు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోగంటి శివ నాగమల్లేశ్వరి కంచికచర్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) ఎన్నిక కాగా, జనసేన పార్టీకి చెందిన త్రివేణి నాయిని ఉపాధ్యక్షురాలిగా (వైస్ ఎంపీపీ) ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పదవులు అనేవి కేవలం హోదా, గుర్తింపు కోసం కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో మండల ప్రజా పరిషత్ కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నూతన పాలకవర్గం చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేస్తూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, గ్రామాల అభ్యున్నతి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా నూతన పాలకవర్గం ముందుకు సాగాలని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.ప్రజలు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కంచికచర్ల మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి, కనకదుర్గ అమ్మవారి ఆలయ ధర్మకర్తల సభ్యురాలు తంబళ్లపల్లి రమాదేవి, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు మండల పార్టీ అధ్యక్షులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు