– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఉత్తర్వులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు, వేతనంతో కూడిన సెలవులు, మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి.లక్ష్మీశ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజున స్థానిక సెలవు వర్తిస్తుందన్నారు. ఓటు హక్కు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయడానికి వీలుగా పరిస్థితులను బట్టి కొంత సమయం వెసులుబాటు కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు పోలింగ్‌కు ముందు రోజు, పోలింగ్ రోజు సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని సూచించారు. సాధ్యం కాని పరిస్థితుల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సమయంలో కనీసం మూడు గంటల పాటు పనికి విరామం కల్పించాలని తెలిపారు. దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు వర్తించేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఎక్సైజ్, పోలీసు అధికారులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
