నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రెండు ప్రాంతాల్లో జాబ్ మేళాలు

-నవంబర్ 23న జగ్గయ్యపేటలో, నవంబర్ 28న తిరువూరులో జాబ్ మేళాల నిర్వహణ
-పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన 18–35 ఏళ్ల యువతీ యువకులకు అవకాశం
-నెలకు రూ.12,000 నుంచి రూ.35,000 వరకు వేతనంతో ఉద్యోగాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

జగ్గయ్యపేట: నవంబర్ 23, 2026 (సోమవారం), ఉదయం 9.00 గంటలకు వాగ్దేవి మహిళా డిగ్రీ కళాశాలలో.

తిరువూరు: నవంబర్ 28, 2026 (శనివారం), ఉదయం 9.00 గంటలకు SLR ప్రతిభ డిగ్రీ కళాశాలలో.

ప్రతి జాబ్ మేళాలో సుమారు 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000 నుంచి రూ.35,000 వరకు వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ పూర్తి వివరాలతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జాబ్ మేళాకు హాజరయ్యే సమయంలో రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్, పాన్ కార్డు కాపీ, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి అధికారి సి.మధుభూషణ్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావుల పర్యవేక్షణలో ఈ జాబ్ మేళాలను నిర్వహించనున్నారు.

మరిన్ని వివరాలకు …
జగ్గయ్యపేట జాబ్ మేళా (23.11.2026): 9666815987, 9014943757.
తిరువూరు జాబ్ మేళా (28.11.2026): 6301534435. ఫోన్ నంబర్లు నందు సంప్రదించాలి.

నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత జాబ్ మేళాలకు హాజరై ఉద్యోగ అవకాశాలను పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు.