ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా మాంసం దుకాణాల్లో తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదేశాల మేరకు నగరంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఒకవైపు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తుండగా, మరోవైపు మాంసం విక్రయ దుకాణాల్లోనూ విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖాధిపతి డాక్టర్ సిహెచ్ నిర్మల గ్లోరీ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గురువారం నగరపరిధిలోని పలు ప్రాంతాల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. డి. హరీష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో పాయికాపురంలోని ఆర్.ఆర్. ఫ్రెష్ ఫుడ్స్ మాంసం విక్రయ దుకాణంలో నిల్వ ఉంచిన 18 కిలోల ఫ్రోజన్ చికెన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్రోజన్ మాంసాన్ని నిల్వ ఉంచినందుకు సంబంధిత దుకాణ యజమానికి నోటీసు జారీ చేయడంతో పాటు రూ.5,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. డి. హరీష్ మాట్లాడుతూ, ప్రజలకు విక్రయించే మాంసం నాణ్యత, తాజాదనం, పరిశుభ్రత విషయంలో దుకాణ యజమానులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో, తగిన నిల్వ పద్ధతుల్లో భద్రపరచాలని, నాణ్యతపై అనుమానాలు ఉన్న లేదా వినియోగానికి అనువుగా లేని మాంసాన్ని విక్రయించకూడదని తెలిపారు. మాంసం విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం, నిల్వ సౌకర్యాలు, ప్రజారోగ్య ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే దుకాణాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు మాంసం విక్రయ దుకాణాల్లోనూ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.