పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ

-30 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష, ట్యూషన్ ఫీజుల పంపిణీ
-ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థుల భవిష్యత్తు ఆగకూడదు: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే గొప్ప ఆశయంతో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
గురువారం (నవంబర్ 19) సాయంత్రం విజయవాడ అరండల్‌పేటలోని ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ హైస్కూల్‌లో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక కార్పొరేటర్ మాచర్ల పావని 30 మంది పేద ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష ఫీజులు, ట్యూషన్ ఫీజులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ విద్య ప్రతి ఒక్కరికీ అందాల్సిన ప్రాథమిక హక్కు అని, పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి చదువుకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా సమాజ అభివృద్ధికి సొసైటీ విశేష కృషి చేస్తోందని ప్రశంసించారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ 1996లో స్థాపించబడిన తమ సంస్థ గత మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు అందిస్తున్నామని వివరించారు.
అదేవిధంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, యూనిఫారాలు, బూట్లు, స్కూల్ బ్యాగులు, ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు బెంచీలు సమకూర్చడం, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆటో ఛార్జీల సహాయం అందించడం, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం, పాఠశాలలకు రంగులు వేయించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదనరావు, సొసైటీ కార్యదర్శి, కోశాధికారి ఎస్.కె. కరీముల్లా, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ రఫీ, సభ్యులు ఎస్.కె. నసీమున్నీసా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మాచర్ల గోపి, దొంగర ఆంజనేయులు, అంజాద్, అస్లాం, జావీద్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.