యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వినియోగించాలి…..

-పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. ఆర్. వెంకట రమణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుండి 24వ తేదీ వరకు “ఒకే ఆరోగ్యం – ఒకే కార్యాచరణ” యాంటీమైక్రోబియల్ నిరోధకతను ఇప్పుడే నివారిద్దాం!” అనే నినాదంతో ప్రపంచ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోందని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. ఆర్. వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు.

నగరంలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో గురువారం వారోత్సవాల అవగాహన పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులు, జంతువులు మరియు వ్యవసాయ రంగంలో యాంటీబయాటిక్స్‌ను అనుచితంగా, అధికంగా ఉపయోగించడం వల్ల సూక్ష్మజీవులలో నిరోధకత పెరిగి అంటువ్యాధులకు చికిత్స చేయడం కష్టతరమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర నిఘా విభాగం ( ఎస్ఎస్ యూ), సమగ్ర వ్యాధి నిఘా కార్యక్రమం (ఐడీఎస్పి) ద్వారా ఆరోగ్య నిపుణులు, విద్యార్థులు, రైతులు మరియు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అర్హత కలిగిన వైద్యుల సూచన మేరకే యాంటీబయాటిక్స్ వాడాలని, సూచించిన మోతాదు మరియు కాలవ్యవధిని పూర్తిగా పాటించాలనన్నారు, చేతుల పరిశుభ్రత పాటిస్తూ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. అలాగే వైద్యుల సలహా లేకుండా సొంతంగా మందులు వాడటం, ఇతరుల ప్రిస్క్రిప్షన్లు లేదా మిగిలిపోయిన మందులు ఉపయోగించడం, సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ వాడటం మరియు చికిత్సను మధ్యలో ఆపడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు ప్రాణరక్షక ఔషధాల ప్రభావాన్ని కాపాడటానికి ప్రజలందరూ యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వినియోగించాలని డాక్టర్ ఆర్. వెంకట రమణ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.