ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శ్రీ భవాని మండల దీక్షలు – 2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
​శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో శ్రీ భవాని మండల దీక్షలు – 2026 అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈరోజు ఉదయం మహా మండపం 6వ అంతస్తులో శ్రీ భవాని అమ్మవారి ప్రతిష్టాపనతో దీక్షా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
​వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ భవాని అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుండి మహా మండపం ఆరవ అంతస్తులోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు వి.శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్ పాల్గొన్నారు.
​పూజా కార్యక్రమాల అనంతరం దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు నాగరాజు శాస్త్రి భక్తులకు భవాని దీక్షా మాలాధారణ చేశారు. తొలిరోజే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది మంది భక్తులు భవాని దీక్షలను స్వీకరించడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు భవాని నామస్మరణతో, దీక్షాధారులతో కిటకిటలాడాయి.
​
భవాని మండల దీక్షలు స్వీకరించదలచిన భక్తులు నవంబర్ 20 నుండి నవంబర్ 24 వరకు ఇంద్రకీలాద్రిపై మండల దీక్షా మాలాధారణతో స్వీకరించవచ్చునని దేవస్థానం వైదిక కమిటీ తెలిపారు.
​ఈ కార్యక్రమంలో ధర్మకర్తలమండలి సభ్యులు బి. ధర్మారావు,ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్,సహాయకార్యనిర్వహణాధికారి ఎన్. రమేష్ బాబు, కే. గంగాధర్, వేదపండితులు పాల్గొన్నారు.