ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎస్.ఆర్.ఆర్. & సి.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ విభాగం, ఎన్‌డీఎల్‌ఐ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ముగింపు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పామర్రు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యార్థుల్లో విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పుస్తక సమీక్ష పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం. పద్మనాభం, అధ్యాపకులు డాక్టర్ కొల్లేటి రమేష్, బి. ప్రకాశం, గ్రంథాలయాధికారి టి. ప్రశాంత్ విద్యాసాగర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.