గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన ప్రత్యేక ‘ఎల్ఆర్ఎస్ మేళా’కు నగర ప్రజల నుండి విస్తృతమైన స్పందన వచ్చిందని, ఇంకా ఎవరైనా ఉంటే వారి కోసం మరో 20 రోజుల్లో మరొకమారు మేళా నిర్వహిస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. జిఎంసి నిర్వహించిన 2 రోజుల ఎల్ఆర్ఎస్ మేళాలో 280 దరఖాస్తులను ప్రాసెస్ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో, బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక మేళాలో పట్టణ ప్రణాళిక సిబ్బంది అందుబాటులో ఉంటున్నారన్నారు. శుక్రవారం 155, శనివారం 125 మంది ఎల్టీపీల ద్వారా హాజరై తమ దరఖాస్తుల పరిష్కారానికి ముందుకు వచ్చారన్నారు. దరఖాస్తుదారు వనుకూరి శ్రీనివాసరెడ్డి 24,14,000 చెల్లించి, దరఖాస్తుని ప్రాసెస్ చేయించుకున్నారని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన స్పందన ప్రకారం మరో 20 రోజుల్లో మరోసారి ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహిస్తామని, ఎవరైనా పెండింగ్ ఉంటే ఇంజినీర్లతో మాట్లాడి, నిర్దేశిత డాక్యుమెంట్స్ సిద్దం చేసుకోవాలని తెలిపారు.
జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి విస్తృత స్పందన..280 దరఖాస్తుల ప్రాసెస్
