కౌలు రైతులకు సహకార సంఘాల్లో సభ్యత్వం కల్పించి ఓటు హక్కు ఇవ్వాలి…

-వాస్తవ సాగుదారులకే పంట రుణాలు అందించాలి – సహకార సంఘాలకు తక్షణమే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని 2,050 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో (PACS) వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు సభ్యత్వం కల్పించి, ఓటు హక్కు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. కాటమయ్య, పి. జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు సహకార సంఘాల్లో సభ్యత్వం లేకపోవడం వల్ల స్వల్పకాలిక పంట రుణాలు పొందలేకపోతున్నారని, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో 2013 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ సహకార సంఘాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించకుండా, ఇన్‌ఛార్జీలు, నామినేటెడ్ పాలకవర్గాలతోనే నడిపిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల సహకార సంఘాల్లో జవాబుదారీతనం కొరవడి, సుమారు రూ.6 వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో సహకార సంఘాలు పూర్తిగా నిర్వీర్యమై పనిచేయలేని స్థితికి చేరుకున్నాయని, ఇందుకు పాలక ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు సహకార సంఘాలను కొందరు పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకుని, సొంత జేబు సంస్థల మాదిరిగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలకవర్గాలతో కొనసాగించడం వల్ల సహకార వ్యవస్థ లక్ష్యాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
మారిన వ్యవసాయ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక శాతంలో పంటలను సాగు చేస్తున్నది కౌలు రైతులేనని, అయినప్పటికీ వారికి సహకార సంఘాల్లో సభ్యత్వం లేకపోవడంతో తక్కువ వడ్డీకి పంట రుణాలు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల పంట సాగు ప్రారంభం నుంచే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, పంటలు సాగు చేయని భూ యజమానుల్లో చాలామంది సహకార సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతూ లక్షలాది రూపాయల పంట రుణాలు పొందుతున్నారని తెలిపారు. ఆ రుణాలను వ్యవసాయ పెట్టుబడులకు వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల వ్యవసాయ రంగానికి అందాల్సిన రుణాలు వాస్తవ సాగుదారులకు అందడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చి, భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకే ప్రాధాన్యతనిస్తూ పంట రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

సహకార సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని, రుణాల మంజూరు, పంపిణీ, వసూళ్లలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. సహకార సంఘాల్లో అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారెంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అప్పుడే సహకార వ్యవస్థపై రైతులకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.సహకార వ్యవస్థను బలోపేతం చేయాలంటే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు సభ్యత్వం, ఓటు హక్కు కల్పించడంతో పాటు, వారికి స్వల్పకాలిక పంట రుణాలు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులు సహకార సంఘాల్లో సభ్యత్వం పొందేందుకు అవకాశం కల్పించాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన కౌలు రైతులకు సభ్యత్వాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి సహకార వ్యవస్థను పునరుద్ధరించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.