-శ్రేష్ఠ–2027 ప్రవేశ పరీక్షకు నవంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
-అర్హులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, సాధికారత అధికారి పి. జ్యోతి లక్ష్మీదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్.టి.ఆర్. జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల, డీనోటిఫైడ్ తెగల విద్యార్థులు శ్రేష్ఠ–2027 కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, సాధికారత అధికారి పి. జ్యోతి లక్ష్మీదేవి సూచించారు. ఈ పథకం ద్వారా 9వ, 11వ తరగతుల్లో నాణ్యమైన వసతి విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల, డీనోటిఫైడ్ తెగల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో శ్రేష్ఠ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం జాతీయ పరీక్షల సంస్థ ఆధ్వర్యంలో శ్రేష్ఠ–2027 జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష తేదీలు, ఇతర పూర్తి వివరాలను తెలుసుకోవడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాతీయ పరీక్షల సంస్థ అధికారిక వెబ్సైటు https://exams.nta.nic.in/ ను సందర్శించాలని సూచించారు.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30 నవంబర్ 2026, రాత్రి 11:50 గంటల వరకు.
జిల్లాలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ, ఉన్నత విద్యా లక్ష్యాలను సాధించి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పి. జ్యోతి లక్ష్మీదేవి కోరారు.
