ఎన్టీఆర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

-నామినేషన్ల పరిశీలన అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
-రెండో విడతలో 138 సర్పంచ్, 1,432 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు
-సర్పంచ్ స్థానాలకు 804 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 4,229 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు
-నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్న సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో భాగంగా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ వెల్లడించారు.

రెండో విడత ఎన్నికలలో నందిగామ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన చెల్లుబాటైన నామినేషన్ల వివరాలను కలెక్టర్ తెలియజేశారు. నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 138 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 1,432 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ అనంతరం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టారని, ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సర్పంచ్ పదవులకు 804 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవులకు 4,229 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు ఆయన వివరించారు.

వత్సవాయి మండలంలో 25 సర్పంచ్ స్థానాలకు 164 మంది, 246 వార్డు సభ్యుల స్థానాలకు 746 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. జగ్గయ్యపేట మండలంలో 19 సర్పంచ్ స్థానాలకు 152 మంది, 212 వార్డులకు 691 మంది అభ్యర్థులు; నందిగామ మండలంలో 23 సర్పంచ్ స్థానాలకు 115 మంది, 228 వార్డులకు 639 మంది అభ్యర్థులు; వీరులపాడు మండలంలో 22 సర్పంచ్ స్థానాలకు 107 మంది, 212 వార్డులకు 583 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అదేవిధంగా, కంచికచర్ల మండలంలో 16 సర్పంచ్ స్థానాలకు 93 మంది, 178 వార్డులకు 512 మంది; చందర్లపాడు మండలంలో 18 సర్పంచ్ స్థానాలకు 91 మంది, 194 వార్డులకు 580 మంది; పెనుగంచిప్రోలు మండలంలో 15 సర్పంచ్ స్థానాలకు 82 మంది, 162 వార్డులకు 478 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వివరించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన పేర్కొన్నారు.