ఈ నెల 23 నుంచి గుంటూరులో మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు

-27 వరకు కేసుల విచారణ.. కొత్త ఫిర్యాదుల స్వీకరణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (APSHRC) ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు గుంటూరులో క్యాంపు కోర్టు నిర్వహించనున్నట్లు క్యాంపు కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఈ క్యాంపు కోర్టులో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించిన మానవ హక్కుల ఉల్లంఘన కేసుల విచారణ చేపట్టడంతో పాటు కొత్త ఫిర్యాదులను కూడా స్వీకరించనున్నారు. ఆయా జిల్లాలకు చెందిన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కమిషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి ఆయా శాఖల అధికారులు కూడా క్యాంపు కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.