వసతి గృహాల అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
మార్పు పథకం కింద ప్రభుత్వ వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం తాడికొండలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల వసతి గృహం, ఎస్‌వీవీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతి పనిలోనూ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పనుల పూర్తిలో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి మయూరి, తహసీల్దార్ సీతారామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.