నవజాత శిశు సంరక్షణపై నిరంతర పర్యవేక్షణకు ఎఫ్‌బీఎన్‌సీ పోర్టల్‌

-70 ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
-210 మంది వైద్యులు, నర్సులు, సమాచార నమోదు సిబ్బందికి అవగాహన

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
నవజాత శిశువులకు అందించే వైద్య సేవల నాణ్యతను పెంచడం, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఎఫ్‌బీఎన్‌సీ (ఆసుపత్రి ఆధారిత నవజాత శిశు సంరక్షణ) పోర్టల్‌ వినియోగాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో చినకాకాని హాయిలాండ్ హోటల్‌లో రెండు రోజుల పాటు పోర్టల్‌ వినియోగంపై ప్రత్యేక పునశ్చరణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను పోర్టల్‌లో ఖచ్చితంగా, సకాలంలో నమోదు చేయడం, సమాచార నమోదు, విశ్లేషణ, పర్యవేక్షణలో వైద్య సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం. బుధవారం నాటి శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్‌ మేనేజర్‌ (జాతీయ ఆరోగ్య మిషన్‌) డా. విజయలక్ష్మి కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవజాత శిశు సంరక్షణ సేవల బలోపేతంలో ఎఫ్‌బీఎన్‌సీ పోర్టల్‌ ప్రాధాన్యాన్ని వివరించారు. జాయింట్‌ డైరెక్టర్‌ (శిశు ఆరోగ్యం) డా. సుబ్రహ్మణ్యం ముఖ్యోపన్యాసం చేస్తూ.. శిశువుల ఆరోగ్య వివరాలను సమగ్రంగా సేకరించడం, విశ్లేషించడం, వైద్య సేవలను పర్యవేక్షించడం ద్వారా సంరక్షణ నాణ్యతను మెరుగుపరచవచ్చని తెలిపారు. యునిసెఫ్‌ కన్సల్టెంట్‌ డా. విక్రమ్‌ రెడ్డి శిక్షణలో వనరుల నిపుణుడిగా పాల్గొని, పోర్టల్‌ వినియోగం, సమాచార నమోదు, సాంకేతిక అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 70 ఆరోగ్య కేంద్రాలకు చెందిన 210 మంది వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులు, సమాచార నమోదు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగాలు (ఎస్‌ఎన్‌సీయూ), నవజాత శిశు స్థిరీకరణ విభాగాల్లో (ఎన్‌బీఎస్‌యూ) పనిచేస్తున్న సిబ్బందికి ఈ శిక్షణ అందించారు.

పోర్టల్‌ వినియోగంపై సమగ్ర అవగాహన
శిక్షణలో భాగంగా పోర్టల్‌లో ప్రవేశం, వినియోగదారుల నమోదు, ఆరోగ్య కేంద్రాల వివరాల నిర్వహణ, నవజాత శిశువుల ఆసుపత్రిలో చేరిక, డిశ్చార్జి వివరాల నమోదు, వైద్య సేవల సమాచార నమోదు, వివరాల ధ్రువీకరణ, నివేదికల తయారీ, డ్యాష్‌బోర్డు వినియోగం, పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలను వివరించారు. సిబ్బందికి స్వయంగా పోర్టల్‌ను వినియోగించేలా ప్రాయోగిక శిక్షణ కూడా ఇచ్చారు.

సేవల నాణ్యత పెంపునకు దోహదం
నవజాత శిశువులకు అందించే వైద్య సేవల వివరాలను పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం ద్వారా ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌బీఎస్‌యూ విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షించవచ్చని సుబ్రహ్మణ్యం తెలిపారు. సేవల్లో లోపాలను గుర్తించి, అవసరమైన నాణ్యతా మెరుగుదల చర్యలు చేపట్టేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ శిక్షణతో రాష్ట్రంలో నవజాత శిశు సంరక్షణ సేవల పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. సమాచార ఆధారిత నిర్ణయాలకు మార్గం సుగమం కావడంతో పాటు, వైద్య సేవల నాణ్యత పెంపు, నవజాత శిశు మరణాలు, అనారోగ్య సమస్యల తగ్గింపునకు దోహదపడుతుందని తెలిపారు.