ఏపీకి పెట్టుబడులు వస్తుంటే గొడ్డలి పార్టీకి కడుపుమంట

-తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం
-గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం
-కుమార్తె పెళ్లికి షర్మిళ ఆహ్వానిస్తే రోత రాతలా?
-మీడియా సమావేశంలో గొడ్డలిపార్టీ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, దాన్ని ఓర్చుకోలేక గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోగా, పెట్టుబడులు రాకుండా అడ్డంకులు సృష్టించడం, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడమేంటని మండిపడ్డారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు గొడ్డలి పార్టీ అరాచకాలను.. విధ్వంసాలను తప్పుపట్టారు. రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కియా మోటార్స్, దాని అనుబంధ సంస్థలు ఏపీకి వస్తుంటే మళ్లీ అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని… తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, పరిశ్రమలు విస్తరించడం, యువతకు ఉద్యోగాలు లభించడం వారికి ఇబ్బందిగా మారిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే, మరోవైపు గొడ్డలి పార్టీ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. విధ్వంసమే గొడ్డలి పార్టీ చరిత్రగా మారిందని విమర్శించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం… రాష్ట్ర ప్రయోజనాలకే విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరికాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం, పెట్టుబడులు పెరగడం అందరికీ ప్రయోజనకరమని, రాజకీయాలకు అతీతంగా వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు.

పొరుగు రాష్ట్రాలతో అభివృద్ధిలోనే పోటీ

కియా మోటార్స్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో దాని అనుబంధ సంస్థలు కూడా ఏపీకి వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంపై అనవసరంగా వివాదం సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కియా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, హోండా సంస్థ తమిళనాడులో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాల మధ్య పరిశ్రమల విషయంలో పోటీ ఉన్నా, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వాల బాధ్యత కావాలని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను గత ప్రభుత్వంలో మాదిరిగా పెండింగ్‌లో పెట్టకుండా, ఇప్పుడు ఎస్క్రో ఖాతా విధానం ద్వారా పారదర్శకంగా అందిస్తున్నామని వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా పెట్టుబడులకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. గత పాలనలో పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు. జాకీ వంటి సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని, అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను కూడా రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితులు కల్పించారని అన్నారు. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించి పరిశ్రమలు వెళ్లిపోయేలా చేసిన గత పాలకులు, ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తుంటే వాటిపైనా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో విధ్వంసంతో పరిశ్రమలను తరిమేసిన వారు, ఇప్పుడు పెట్టుబడుల రాకను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థికాభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యమయ్యాయని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని, విధ్వంసకర రాజకీయాలను పక్కనపెట్టి ప్రజాహితం కోసం పనిచేయాలని చంద్రబాబు హితవు పలికారు. ఇలా వ్యవహరించని వారిని రాజకీయంగా దూరం పెట్టాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.

రాజకీయ వైరుధ్యాలున్నా మానవ సంబంధాలను గౌరవించాలి

వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ బంధాల విషయంలోనూ రాజకీయ హుందాతనం పాటించాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రిక అందించేందుకు వస్తే, దానిపై గొడ్డలి పార్టీ సొంత పత్రికలో రోత రాతలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఆహ్వాన పత్రిక ఇవ్వడం ఒక మర్యాదపూర్వకమైన సంప్రదాయమని, దాన్ని కూడా రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగతంగా అవమానించేలా నీచపు వార్తలు రాయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత చెల్లెలు పెళ్లికి ఒక ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే, దానిపైనా ఇంత నీచంగా కథనాలు రాస్తారా? కుటుంబ బంధాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా? అని నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాను మంచి స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ తమ మధ్య మానవ సంబంధాలు ఎప్పుడూ దెబ్బతినలేదని చెప్పారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత సంబంధాలకు ముడిపెట్టకూడదని, ప్రజా జీవితంలో ఉన్నవారు కనీస మర్యాద, హుందాతనం పాటించాలని అన్నారు. ఒక కుటుంబంలో జరిగే శుభకార్యానికి ఆహ్వానించడం వంటి సాధారణ మానవీయ అంశాలను కూడా వివాదాస్పదం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తిగత వివాదాలు, కక్ష సాధింపుల కోసం కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు, సంస్కారం, హుందాతనం ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడటం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటమే రాజకీయ పార్టీల బాధ్యత అని ముఖ్యమంత్రి అన్నారు.