గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
అధికారులు, రాజకీయ పార్టీల సమన్వయంతో గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ సవరించిన షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు, వచ్చే నెల 1వ తేదీన పోలింగ్, 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అయోమయం లేకుండా సజావుగా పూర్తి చేసేందుకు ప్రతి సిబ్బందికి కనీసం రెండు విడతల్లో సమగ్ర శిక్షణ ఇస్తున్నామన్నారు. గుంటూరు నగరంలో 596 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయని, ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు నలుగురు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అలాగే, పోలింగ్ రోజున విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 27, 28 తేదీలలో ఏసీ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను ఈ ప్రక్రియను పరిశీలించేందుకు పంపవచ్చని సూచించారు. ఇప్పటికే వార్డుల వారీగా ఉచిత ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించగా, పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రింటెడ్ ఓటర్ల జాబితా కాపీలు కావాల్సిన వారు నిర్ణీత రుసుము చెల్లించి ఎలక్షన్ సెల్ ద్వారా పొందవచ్చని తెలిపారు. అలాగే ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకొనుటకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లింక్ లో 🔗 Voter Details Verification Link:https://sec-ems.ap.gov.in/apsec/voterPortal చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటింటికి ఓటర్ స్లిప్ లు పంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలింగ్ రోజుకి ముందు రోజు ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ ఆంద్రా ముస్లిం కాలేజిలో ఏర్పాటు చేశామని, అక్కడి నుండి పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో సామాగ్రిని తరలించడానికి ప్రత్యేకంగా రూట్ ఆఫీసర్స్ ని నియమించడం జరిగిందన్నారు. పోలింగ్ అనంతరం కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజిలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ కి బ్యాలెట్ బాక్స్ చేర్చేలా పిఓలు, రిటర్నింగ్ అధికారులతో పాటు రూట్ ఆఫీసర్స్ కూడా భాధ్యత తీసుకుంటారన్నారు. పోలింగ్, కౌంటింగ్ ఏజంట్లకు గుర్తింపు కార్డ్ లను పిఓలు, రిటర్నింగ్ అధికారులు అందిస్తారని, అభ్యర్ధుల ఫైనల్ లిస్టు పబ్లిష్ చేసిన అనంతరం ఏజంట్ల లిస్టు లను అధికారులకు అందించాలని సూచించారు. ఎన్నికల్లో ఒకే బ్యాలెట్ బాక్స్ లో మేయర్ అభ్యర్ధికి పింక్ కలర్, కార్పొరేటర్ అభ్యర్ధికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉంటుందని, రెండింటిని ఒకే బ్యాలెట్ బాక్స్ లో వేయాలని తెలిపారు. అభ్యర్ధులు చేపట్టే ర్యాలీలు, ప్రచార వాహనాలు, మైక్ లకు జిఎంసిలోని సింగిల్ విండో కౌంటర్ లో దరఖాస్తు చేస్తే 24 గంటల్లోగా అందించేందుకు చర్యలు తీసుకున్నామని, అభ్యర్ధులు వినియోగించే స్వంత వాహనాలకు రిటర్నింగ్ అధికారుల దగ్గరే అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా ప్రచారం చేసినా, వాహనాలు వినియోగించినా ఎన్నికల నిబందనల మేరకు కేసులు నమోదు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, అభ్యర్ధులు సమన్వయంతో గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని, ఏ సమస్య ఉన్నా తక్షణం విభాధిపతులు లేదా డిప్యూటీ కమిషనర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ.కిశోర్, జి.రవీంద్ర, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ డి.రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల నుండి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఓంకార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి సిహెచ్.వాసు, సిపిఎం ప్రతినిధి నళిని కాంత్, వైఎస్ఆర్సిపి ప్రతినిధులు మహేష్ రెడ్డి, ఖాసిం, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు నారాయణరెడ్డి, సిహెచ్.కుమార్, పాల్గొన్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: కమిషనర్ మయూర్ అశోక్
