ప్రకృతితో మమేకమైన మ్యాంగో స్ట్రీట్ ఆదర్శనీయం : నగర మేయర్ లక్ష్మీ అపర్ణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎస్.వి.ఎన్. కాలనీలోని మ్యాంగో స్ట్రీట్ వాసులు మంగళవారం ఘనంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ లక్ష్మీ అపర్ణ కోవెలమూడి వీధిలో ఏర్పాటు చేసిన మొక్కలను, వాటి సంరక్షణకు స్థానికులు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ప్రకృతితో మమేకమై పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ తీర్చిదిద్దిన ఇలాంటి వీధిని తొలిసారిగా చూస్తున్నానని, ఇది తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని మేయర్ పేర్కొన్నారు. మ్యాంగో స్ట్రీట్ వాసులు చేపట్టిన ఈ పర్యావరణహిత కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు.
అనంతరం స్థానికులు తమ వీధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, స్థానిక ప్రముఖులు నల్లమోతు రత్తయ్య, మందడపు చంద్రశేఖర్, ముద్ర వీరాంజనేయులు, శ్రీహరి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.