జగన్ రాజకీయ అవసరాల కోసం మతాలను వాడుకుంటున్నారు: బుచ్చి రాంప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్ల పేర్లతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ హయాంలో రామతీర్థం, అంతర్వేది ఆలయ ఘటనలు జరిగినప్పుడు స్పందించని జగన్‌కు ఇప్పుడు ‘హే రామ్’ గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు.
కాదంబరి గ్రామంలోని ఆలయ భూసేకరణ 2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి రూ.59 లక్షలకు పైగా నిధులు కేటాయించడంతో పాటు 2,500 గజాల స్థలాన్ని సమకూర్చిందని తెలిపారు. ఈ నెల 22న ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాత్కాలిక ఆలయంలోకి తరలించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఆలయాన్ని కూల్చివేశారన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఆలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలు రాజకీయ ఆరోపణలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని బుచ్చి రాంప్రసాద్ కోరారు.