-బాధిత కుటుంబానికి రూ.4.12 లక్షల మొదటి విడత పరిహారం విడుదల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి కల్పనకు హామీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు తిమ్మసత్తి నరేష్ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, న్యాయం, సంక్షేమ ప్రయోజనాలు కల్పించేలా ఎస్టీ కమిషన్ తరఫున అండగా నిలిచారు.
నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గోకరాజుపల్లిలో బాధిత కుటుంబాన్ని కలిసిన ఆయన, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి ప్రభుత్వం మొత్తం రూ.8,25,000 పరిహారం మంజూరు చేసిందని, అందులో మొదటి విడతగా 50 శాతం అంటే రూ.4,12,500 విడుదల చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా బాధిత కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు, కుటుంబానికి ఇంటి స్థలం, వ్యవసాయ భూమి మంజూరు చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా గిరిజనులపై దాడులు, హత్యలు, అన్యాయాలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని వెంకటప్ప పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు చట్టప్రకారం అందాల్సిన న్యాయం, పరిహారం, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జ అజయ్, రెవెన్యూ డివిజనల్ అధికారి అనిల్ కుమార్, తహసీల్దార్ పాలపర్తి రవికుమార్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్, తిమ్మసత్తి నాగేశ్వరరావు, చినుకుని విజయ తదితరులు పాల్గొన్నారు.
