– ప్రజలకు సుపరిపాలన అందించడంలోనే నిరంతర సంతృప్తి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
టీమ్ ఎన్టీఆర్ సమష్టి కృషి, అధికారుల సమన్వయం, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే గత రెండేళ్లలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయగలిగామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
డా. జి.లక్ష్మీశ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి బుధవారం నాటికి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పలువురు జిల్లా అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వికాస, ఇగ్నైట్ సెల్ కార్యక్రమాలకు స్కోచ్ అవార్డులు, ఆకాంక్షిత మండలాలకు నీతి ఆయోగ్ గుర్తింపు, గుంటుపల్లి రైజ్ కేంద్రం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం వంటి విజయాలు టీమ్ ఎన్టీఆర్ కృషికి నిదర్శనమన్నారు. జిల్లా ఆర్థికాభివృద్ధికి 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యంగా వివిధ శాఖల పనితీరును 563 కీలక పనితీరు సూచీల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు, యువతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో అనుసంధానం వంటి కార్యక్రమాలు జిల్లా అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు.
దసరా ఉత్సవాలు, సరస్ మేళా వంటి భారీ కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టగలిగామని పేర్కొన్నారు. ఈ విజయాల వెనుక ప్రతి అధికారి, ఉద్యోగి కృషి ఉందని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సమష్టిగా పనిచేద్దామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
